![]() |
![]() |
డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వచ్చాక థ్రిల్లర్ జోనర్ సినిమాలకు లభిస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు. అడుగడుగునా ఉత్కంఠ రేకెత్తించే సస్పెన్స్, దానికి తోడు ఒక క్రైమ్ ఎలిమెంట్, కోర్టు రూమ్ డ్రామా ఉంటే ఆ కంటెంట్‌ను చూసేందుకు ఓటీటీ ఆడియన్స్ ఎప్పుడూ ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అలాంటి ఒక హై-వోల్టేజ్ లీగల్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు నేరుగా డిజిటల్ స్క్రీన్‌పై అలరించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఆ క్రేజీ కోర్టు రూమ్ డ్రామా చిత్రమే 'ఇక్కా'. దాదాపు మూడు దశాబ్దాల క్రితం 'బోర్డర్' వంటి క్లాసిక్ బ్లాక్‌బస్టర్ చిత్రంలో కలిసి నటించిన ఈ ఇద్దరు దిగ్గజ నటులు, మళ్లీ ఇన్నాళ్లకు ఈ మైండ్ గేమ్ థ్రిల్లర్‌లో ముఖాముఖి తలపడనుండటం సినిమా లవర్స్‌లో భారీ అంచనాలను పెంచేస్తోంది. ఈ పవర్‌ఫుల్ లీగల్ డ్రామాను ప్రముఖ ఓటీటీ దిగ్గజం 'నెట్ ఫ్లిక్స్' సంస్థ జులై 10వ తేదీ నుంచి గ్రాండ్‌గా స్ట్రీమింగ్ చేయబోతోంది.
ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ పి. మల్హోత్రా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం పూర్తి కోర్టు రూమ్ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. నగరంలోనే అత్యంత ప్రతిభావంతుడైన, ఇన్‌కరుప్టబుల్ లాయర్ అర్జున్ మెహ్రా పాత్రలో సన్నీ డియోల్ కనిపించనున్నారు. లీగల్ కమ్యూనిటీలో ఆయనను అందరూ ఎంతో గౌరవంగా 'ఇక్కా' అని పిలుచుకుంటారు. అర్జున్ మెహ్రా ఒక కేసును చేతుల్లోకి తీసుకున్నాడంటే, ఆ కేసులో ఓడిపోవడమనేది ఆయన నిఘంటువులోనే ఉండదు. అందుకే కోర్టులో ఆయనకు ఎదురుగా నిలబడి వాదనలు వినిపించడానికి ప్రత్యర్థి లాయర్లు సైతం వణికిపోతుంటారు. అలాంటి అజేయమైన లాయర్‌ను ఒక హై ప్రొఫైల్ హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న శౌర్యమన్ గౌర్ (అక్షయ్ ఖన్నా) ఆశ్రయిస్తాడు. తనను ఎలాగైనా ఈ చట్టపరమైన చిక్కుల నుండి కాపాడాలని కోరతాడు. అయితే, ఇక్కడే కథలో ఊహించని పెద్ద ట్విస్ట్ ఎదురవుతుంది.
అర్జున్ మెహ్రా గతంలో ఏ వ్యక్తి కెరీర్‌ను అయితే ముగించాడో, ఇప్పుడు అదే శౌర్యమన్‌ను కాపాడటానికి తన నైతిక విలువలను, చట్టపరమైన నియమాలను సైతం పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తన కుటుంబ సభ్యుల ప్రాణాలు ప్రమాదంలో పడటంతో, శౌర్యమన్‌ను నిర్దోషిగా నిరూపించడానికి అర్జున్ మెహ్రా ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? తన మనస్సాక్షితో ఎలాంటి యుద్ధం చేశాడు? అనేది మిగతా కథాంశం. ఈ సినిమాలో సన్నీ డియోల్ భార్య అవంతికా మెహ్రాగా ప్రముఖ నటి దియా మీర్జా కీలక పాత్రలో నటించగా.. తిలోత్తమ షోమ్, శిశిర్ శర్మ, ఆకాంక్ష రంజన్ కపూర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర అఫీషియల్ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా మధ్య సాగే మైండ్ గేమ్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మరి ఈ లీగల్ థ్రిల్లర్ డిజిటల్ ఆడియన్స్‌ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో తెలియాలంటే జులై 10 వరకు వేచి చూడాల్సిందే!
![]() |
![]() |